చిన్నారుల్ని ఆటలవైపు మళ్లించడం ఎలా

Vidyashree Rai సృష్టికర్త నవీకరించబడిన Aug 10, 2022

ఇంట్లో మూడు నుంచి ఏడేళ్ల మధ్య పిల్లలు ఉంటే సందడికి కొదవే ఉండదు. అల్లరి చేస్తూ లేడి పిల్లల్లా గంతులు వేస్తూ రోజంతా మనలని కూడా పరుగులు పెట్టిస్తారు. ఇంట్లో అల్లరి పక్కన పెడితే వాళ్ళని ఆటల వైపు మళ్లించేదెలా? ఆ వయసు పిల్లలని సాధారణంగా నర్సరీ కి లేదా పాఠశాలకు పంపిస్తాం. ఈరోజుల్లో ఐతే వాళ్ళు మోసే పుస్తకాల బరువు జీవితంలో ముందు ముందు ఎదురయ్యే సమస్యల భారాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇక ఆటలు కూడానా అంటారా? నిజానికి ఆటలు వారికి చాలా ముఖ్యమైన విషయం.
చిన్నారుల్ని ఆటలవైపు మళ్లించడం ఎలా?
చదువుల పని పక్కన పెడితే వాళ్ళని ఆటల వైపు మళ్లించడం వల్ల వారి మానసిక, శారీరక వికాసం పెరుగుతుంది. సమస్యలని పరిష్కరించే జ్ఞానం పోటీతత్వం పెరుగుతాయి. మరి వాళ్లకి ఆటల మీద ఇష్టం పెంచేదెలా, సరైన విధంగా అలాగే వాళ్లకు తగినట్టుగా ఆటలను ఎంపిక చేయడం ఎలాగో ఒకేసారి అవలోకనం చేద్దాం.
ముందుగా వారికి ఇష్టమైన ఆటలు ఏమిటో గమనించండి. ఉదాహరణకి కొంత మంది పిల్లలు క్యారం బోర్డు, చదరంగం, బంతి తో ఆడే ఆటలు, క్రికెట్, పజిల్స్, మొదలైనవంటే ఇష్టం చూపుతారు. భవిష్యత్తు సచిన్ లు సింధు, సైనా లాంటి వారు మీ ఇంట్లోనే తయారవుతారేమో చూడండి, వారికి ఇష్టమైన ఆటవైపు ప్రోత్సహించండి.
ఒక వేళ వారికి ఏ ఆటమీద ఇష్టంలేకపోతేనో, మరేం పర్వాలేదు దానికి కూడా ఒక చిట్కా ఉంది. ముందు పిల్లలు ఇష్టంచూపించక పోవడానికి కారణం కనుక్కోండి. కొంత మంది పిల్లలకి ఓటమి భయం, శారీరక శ్రమ, అసలు ఆటని ఎలా ఆడాలో సరిగ్గా తెలియక పోవడమో లేదా తోటి పిల్లలు హేళనగా మాట్లాడారనో ఇష్టం కోల్పోతారు. సమస్య తెలిస్తే ఇక పరిష్కారం సులభమే కదా. వారికి ఉన్న భయాన్ని పోగొట్టండి వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడండి. పొగడ్తే చిట్కా మన చిన్ని పాపలకి. ‘చాలా బాగా ఆడావే బంగారం’ అని మీరు పొగిడితే వాళ్లకి ఆ వయసులో అదే ఒలంపిక్ కప్పు గెలిచినంత ఆనందం.
పక్కింటి పిల్లల్ని పిలిచి వారితో ఆడేలా చుడండి లేదా దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్లండి అక్కడ సాటి పిల్లలు ఆడటం చూసి మన పిల్లలు కూడా వారితో చేరుతారు. ఇలాంటి వాటి వల్ల పిల్లలో స్నేహతత్వం సామాజిక స్పృహ పెరుగుతాయి.
ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ఆటలు ఆడేలా కృషి చేయడానికి మొదటి కారణం వాళ్ళ ఆరోగ్యం , సత్ప్రవర్తన మరియు క్రమశిక్షణ పెంపొందించడానికి, కానీ వారికి ఈ విషయాల పట్ల అవగాహన ఉండదు కాబట్టి కేవలం సరదాకి మాత్రమే ఆడడానికి ఇష్టపడతారు. అది లోపిస్తే వారికి ఆటల మీద ఇష్టం పోయి ఎంత సేపు టీవీ చూడడమో ఫోన్లతో ఆడుతూనే గడిపేస్తారు. దీని వల్ల ఊబకాయం బారిన పడతారు కాబట్టి ఆటలో సరదా నింపండి పొగడ్తలతో పాటు చిన్నచిన్న తాయిలాలు ఇవ్వండం మరవొద్దు. ఇష్టమైన స్వీటు మిఠాయి ఏదయినా సరే పర్వాలేదు.
ఇంట్లో మీ వారికి ఖాళి సమయం దొరికిందా ఐతే ఇంకేం కుటుంబం అంతా కలిసి చక్కగా ఆడుకోండి పిల్లలతో కలిసి ఆడడం వల్ల వాళ్లకి మీతో బంధం బలపడటంతో పాటు ఆటలంటే ఇష్టం వాటిపై సద్భావన కూడా కలుగుతుంది.
చిన్న పిల్లలకి ఏకాగ్రత చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ చిన్ని ప్రపంచంలో పరిశోధించడానికి ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి ఎంత సేపు ఒకే విధంగా కాకుండా ప్రతిసారి ఏదయినా కొత్తగా చేయండి. ఒకరోజు బంతి తో ఆడే ఆటలు ఉంటే ఇంకోసారి దాగుడు మూతలో లేదా క్రికెట్టో ఆడించండి. దీని వల్ల వాళ్ళు విసుగు చెందకుండా ఉంటారు.
వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కదా అని ఆటలు ఆడమని వారిని బలవంత పెట్టొద్దు దీని వల్ల వారికి మొండి తనంతో పాటు అయిష్టత కలుగుతుంది. కాబట్టి ఏదయినా మెల్ల మెల్లగా అలవాటు చేయండి.
మూడునుంచి ఏడేళ్ల వయసు గల పిల్లలకి సరదా తో పాటు సునాయాసంగా ఉండే ఆటలు ఉండాలి. వాళ్ళలేత శరీరం అధిక శ్రమ తట్టుకోలేదు కాబట్టి మరీ ఎక్కువ సమయమో లేదా కష్టంగా ఉండే ఆటలు అవసరం లేదు.
ఇంట్లో అంతా కూర్చుని టీవీ చూసేటప్పుడు ఏవైనా ఆటల కార్యక్రమం వస్తుంటే చుడండి ఎంత బాగా ఆడుతున్నారో కదా చూడు అని చెప్పండి. వాళ్లకి కూడా మీ చేత అలాంటి ప్రశంసలు పొందాలి అనిపిస్తుంది. ఈ మధ్యవేసవి కాలాల్లో చిన్న పిల్లలకి ప్రత్యేకంగా ఆటల శిక్షణ ఇస్తున్నారు. మీ పిల్లల ఇష్టాన్ని బట్టి వాటిలో చేర్పించండి. వారికి కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు.
మరి చిన్నారుల్ని ఎలా ఆటల వైపు నడిపించాలో అర్థమయింది కదా . ఒకప్పుడు పిల్లలు అంటే ఆటలే. రోజంతా గెంతుతూ తుళ్ళుతూ ఆడుకునే వారు. పెద్దవాళ్లు ఇక ఆడింది చాలు ఇంటికి రండి అనేవారు కానీ ఇప్పుడు ఫోన్లతో రోజంతా గడిపే పిల్లలని చూసి ఇక చూసింది చాలు వెళ్లి కాసేపైనా ఆడుకోండి అని మందలించాల్సిన రోజులు వచ్చాయి. కాబట్టి వారిని వారికి ఇష్టమైన మరియు సాధ్యమైన ఆటలు వైపు మళ్లించడం వల్ల వాళ్లలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చడానికి తల్లిదండ్రులుగా మనవంతు బాధ్యత నిర్వహించవచ్చు.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె బ్లాగ్లు
పైన అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె చర్చలు
పైన అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}