ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: అందరికీ మెరుగైన వైద్యం కోసం ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jul 28, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని సుదూర, గ్రామీణ ప్రజలకు శుభవార్త. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇది అసలైన శుభవార్త. సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ పధకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి విద్దల రజినీ ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ ఫ్యామిలీ డాక్టర్ ను తెరపైకి తెచ్చారు.
సాధారణంగా ఫామిలీ డాక్టర్ లేదా కుటుంబ వైద్యుడు అంటే కుటుంబంలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆ వైద్యుడిని సంప్రదిస్తారు. అతను వారిని పరిశీలించి జబ్బును గుర్తిస్తారు. సమస్య చిన్నదైతే ఆయనే వైద్యం చేస్తారు. కాస్త సీరియస్ అయితే, స్పెషలిస్ట్ లకు రిఫర్ చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పూర్తీ అవగాహన కలిగిఉంటారు. ఇదే తరహాలో గ్రామీణ, సుదూర ప్రాంత ప్రజలకు కూడా వైద్య సంరక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ఫామిలీ డాక్టర్ పధకం చేపట్టారు.
ఫామిలీ డాక్టర్ పధకం ముఖ్యాంశాలు
ఫ్యామిలీ డాక్టర్ పధకంలో భాగంగా ప్రతి ఐదు లేదా ఏడు గ్రామాలకు ఒక వైద్యుడిని నియమించనున్నారు. ఆయా వైద్యులు, తమకు కేటాయించిన గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందీస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. అలాగే ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు 104 అంబులెన్స్‌లను పంపిస్తారు. ప్రత్యేక వైద్యుల్లో ఒకరు కేటాయించిన గ్రామాల్లో పీహెచ్ సీలో ఉంటే, మరో వైద్యుడు గ్రామానికి వెళ్లి ప్రజలను నేరుగా పరీక్షిస్తారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ఎలా పని చేస్తుందంటే..
-
వార్డు సచివాలయం పరిధిలో వైద్యుల కార్యక్రమం జరిగే ముందు రోజు ANMలు, ఆశా వర్కర్లు ఇంకా మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHPs) డోర్ టు డోర్ సందర్శన నిర్వహిస్తారు.
-
వైద్యసేవలు అవసరమైన వారిని గుర్తించి, ఆ జాబితాను డాక్టర్‌కు అందజేస్తారు. పిహెచ్సి డాక్టర్ ఈ ఇళ్లను సందర్శించి ఆరోగ్య సేవలు అందిస్తారు.
-
ఇందుకుగాను వార్డు, గ్రామ సచివాలయంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి ఒక వైద్యుడిని అందుబాటులో ఉంచుతామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఫామిలీ డాక్టర్ పనివేళలు
-
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వార్డులో నివసించే వారికి ప్రభుత్వ వైద్యుడు ఔట్ పేషెంట్ సేవలను అందిస్తారు.
-
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకు భోజన విరామం ఉంటుంది.
-
అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి. 4.30 గంటల వరకు, అదే వైద్యుడు వార్డులో తీవ్రమైన అనారోగ్యంతో, ప్రసవానంతర మరియు ప్రసవానంతర సంరక్షణ అవసరమైన రోగుల ఇళ్లను సందర్శిస్తారు.
మరి, ప్రజలందరికీ వైద్యాన్ని మరింత చేరువ చేయనున్న ఫామిలీ డాక్టర్ పధకాన్ని గురించిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా అనిపించిందా.. ఐతే తప్పక షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి.