పిల్లల పెంపకం...తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని సాధారణ చిట్కాలు..

పిల్లల పెంపకం అనేది ఒక గురుతరమైన బాధ్యత. దీని కోసం తల్లిదండ్రులు తమ జీవితాలనే పణంగా పెడతారు. మన భారతదేశం లాంటి సాంప్రదాయ విలువలు కలిగిన దేశంలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. మన పిల్లలే మన భవిష్యత్తు అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు.
ఒకప్పటి రోజుల్లో పిల్లల పెంపకం అంటే అది ఒక ప్రత్యేకమైన బాధ్యతగా ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబాలలో పెద్దలను, కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని చూస్తూ, వాటిని అలవరచుకుంటూ పెరిగే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న కుటుంబాలు, తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగాలతో పాటు ఈ రోజులలో విపరీతమైన మార్పులు చూస్తున్నాము. అందుకే ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద మాత్రమే ఉంటుంది.
పిల్లల పెంపకం విషయంలో అన్నిటికంటే ముందు తల్లిదండ్రుల ప్రవర్తన అన్నది ఎంతో ముఖ్యమైనది. తల్లిదండ్రులు మృధు స్వభావులు మరియు సానుకూలంగా స్పందించే వారు అయితే పిల్లలు కూడా అలాగే ఉంటారు. తల్లిదండ్రులు తమ పెద్దల తోనూ తల్లిదండ్రుల బాధ్యతగా, ప్రేమగా
ప్రవర్తిస్తున్నట్లు అయితే పిల్లలు కూడా అటువంటి ప్రవర్తనని అలవర్చుకుంటారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడడం చేయకుండా ఇరువురు స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే ఆ కుటుంబ వాతావరణం ఎంతో బాగుంటుంది. ఇంట్లో మంచి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటుగా బయటకు వెళ్ళుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా పాటించాలి.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని సాధారణమైన జాగ్రత్తలు :
1. ప్రేమను వ్యక్తపరచడం :
ప్రతి తల్లిదండ్రులకు పిల్లల మీద కచ్చితంగా ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు దానిని బయటకు చూపించడానికి ఇష్టపడరు. కానీ తమ ప్రేమను పిల్లలకు వ్యక్తపరచి నట్లయితే వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఉపయోగపడుతుంది అని నిపుణులు సెలవిస్తున్నారు. ప్రేమతో దేనినైనా సాధించగలరు అని తల్లిదండ్రులు గమనించాలి. పిల్లల విషయంలో ప్రేమ ఉండాలి. కానీ అది వారిని పాడు చేసే గారాబంలా ఉండకూడదు అని తల్లిదండ్రులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలను అనే స్వతంత్రం ఉండేలా ప్రవర్తించాలి.
2. లింగ భేదం ఉండకూడదు :
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆడ-మగ తేడాల విషయంలో విభేదాలు చూపించే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు , మన దేశంలో ఈ రోజుకి కూడా ఎంతోమంది ఆ తేడాలను చూపిస్తున్నారు. పురుషాధిక్యం అన్నది ఈరోజుకి కొనసాగుతూనే ఉంది. అది చిన్న వయసులోనే మన కుటుంబం నుండే ఇద్దరినీ సమానంగా భావించడం మొదలు పెట్టాలి. అది వారి భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అది భవిష్యత్తులో వారి కుటుంబంలో సమాధానానికి ఎంతో ఉపయోగ పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
3. వారి పనులు వారే చేసుకోవడం :
పిల్లలను ప్రేమించాలి. గారాబంగా చూసుకోవాలి. అంతే కానీ వారిని సోమరిపోతులుగా మార్చ కూడదు.చిన్నతనం నుండి వారి పనులను ప్రణాళికాబద్ధంగా వారే చేసుకోవడం నేర్పించాలి. వారీ పక్క బట్టలు వాళ్లే మడచి పెట్టుకోవడం, భోజనం చేసిన తర్వాత ప్లేట్ సింక్ లో వేయడం, వారి వార్డ్ రోబ్, బుక్ రోబ్ వాళ్లే సర్దుకునేలాగా అలవాటు చేయాలి. వయస్సు వారిగా పిల్లలకు వారి పనులు వారు చేసుకునే విధంగా చిన్న వయస్సులోనే నేర్పించాలి. చిన్నతనంలో ఆ అలవాటు చేసినట్లయితే వారు భవిష్యత్తులో కూడా తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు. పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. అది వారి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
4. స్నేహితుల విషయంలో జాగ్రత్త వహించాలి :
"నీ స్నేహితులు ఎవరో చూపిస్తే నీవు ఎలాంటి వాడివో నేను చెబుతాను" అని ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. అదేవిధంగా పిల్లలు విషయంలోనూ జరుగుతుంది. కాబట్టి వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో గమనిస్తూ వుండాలి. అలా అని అందరినీ అనుమానించాలి అని కాదు. వారి స్నేహాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి స్నేహితులను గౌరవించాలి. అదేవిధంగా చెడు స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా సున్నితమైన విషయం. చెడు స్నేహితులకు ఎందుకు దూరంగా ఉండాలో పిల్లలకు ఉదాహరణలతో సున్నితంగా వివరించి చెప్పాలి.ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు ఎక్కడ సహనాన్ని కోల్పోకూడదు.
5. ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలి :
ప్రతి పిల్లలలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి. పిల్లలు చదువుకునేందుకు చక్కటి వాతావరణాన్ని కలిగించాలి. వారు కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టంగా చదివేందుకు శ్రద్ధ చూపిస్తారు. అటువంటి వాటిలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వాలి. జనరల్ నాలెడ్జ్ గురించి చిన్న వయస్సు నుండే తెలుసుకోవడానికి అలవాటు చేయాలి. అనిమల్ ప్లానెట్, డిస్కవరీ లాంటి చానెల్స్ చూడడానికి చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి.
6. పిల్లలను ఎప్పుడు విమర్శించకండి :
తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ చిన్నవారు అని భావిస్తారు. కొన్ని సార్లు వారికి తెలియకుండానే పిల్లలను విమర్శించడం లాంటివి చేస్తారు. పిల్లలను విమర్శించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.పిల్లల ని విమర్శించడం కంటే వారు ఏ తప్పు చేస్తున్నారో ప్రేమగా తెలియజేయాలి. వారిని మార్చే ప్రయత్నం కూడా ప్రేమతోనే చేయాలి. లేదంటే వారు ఇంకా మొండిగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కొంత సహనాన్ని పాటించాలి.
పిల్లలకు స్వేచ్ఛ , క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. వాటిని గుర్తించి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా వాటిని పిల్లలకు సమకూర్చగలగాలి. ఎదుటి వారిని గౌరవిస్తూ , నీతిగా బతకడం అన్నది పిల్లలకు చిన్న వయస్సు నుండే నేర్పాలి. ఈ ప్రక్రియలో పిల్లల కంటే ముందుగా తల్లిదండ్రులే కొన్ని విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. తల్లిదండ్రుల మైన మనం కూడా మానవ మాత్రుమే. ఎవరి బలహీనతలు వారికి ఉంటాయి. మనం మన బలహీనతలను సరిదిద్దుకో గలిగినప్పుడే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలం.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...